ఏపీలో నేతన్న భరోసా పథకం 2026 అమలు.. అర్హుల ఖాతాల్లో నేరుగా రూ.25,000 జమ!
ఏపీలో నేతన్న భరోసా పథకం 2026 అమలు.. అర్హుల ఖాతాల్లో నేరుగా రూ.25,000 జమ!
AP Nethanna Bharosa Scheme 2026 :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే నేతన్న భరోసా (AP Nethanna Bharosa Scheme 2026) అమలు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడి బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి రూ.25,000 ఆర్థిక సహాయం నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు.
నేతన్న భరోసా పథకం ద్వారా ఏం లభిస్తుంది?
ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలో అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు.
ఉచిత విద్యుత్‌తో పాటు నాణ్యమైన నూలు సరఫరా:
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కొనసాగిస్తూ, వారి అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని ఆమె తెలిపారు. అలాగే ఆప్కో (APCO) ద్వారా నాణ్యమైన నూలు సరఫరా చేసే విధానాన్ని మరింత బలోపేతం చేసి, చేనేత కార్మికుల పెట్టుబడి భారం తగ్గించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఆధునిక మార్కెట్‌కు అనుగుణంగా శిక్షణ :
ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేనేత కార్మికులకు రెడీమేడ్ చేనేత వస్త్రాల తయారీపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీని ద్వారా చేనేత ఉత్పత్తులకు మార్కెట్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆప్కో బకాయిల చెల్లింపులపై ప్రకటన :
ఆప్కో చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన రూ.6.50 కోట్ల బకాయిలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన రూ.4 కోట్లు, వచ్చే నెల తొలి వారంలో మరో రూ.2.5 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
అదనంగా, ఆప్కో ద్వారా తయారయ్యే సాలువాలు, కండువాలు మరియు ఇతర చేనేత వస్త్రాల కొనుగోళ్లకు ప్రభుత్వ స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు.
మంగళగిరిలో నిర్వహించిన ఆప్కో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సవిత గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. నేతన్న భరోసా పథకం ద్వారా వేలాది మంది చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు.